

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణవ్యాప్తంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు. బోనాల సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం లౌకిక విధానాలకు కట్టుబడి ఉన్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. అన్ని మతాలను గౌరవిస్తామని, ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం కాంగ్రెస్ విధానం కాదన్నారు. బోనాల వంటి సంప్రదాయ పండుగను కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తోందని, ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసి మాట్లాడాలని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!