

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో 2జీ, బొగ్గు కుంభకోణాలు జరిగాయని ప్రస్తావించిన ఆయన, తెలంగాణలోనూ కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆరోపణలు పెరిగాయని అన్నారు. నలుగురు మంత్రులు, నలుగురు గుత్తేదారుల చేతుల్లో రాష్ట్రం నలిగిపోతోందని వ్యాఖ్యానించారు. ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చి భూ దందాలకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. ధరణిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన ఫోరెన్సిక్ ఆడిట్ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, నివేదికలోని వివరాలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు.
22-ఏ కింద పేదల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, అటవీ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఏలేటి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ నేతలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఆ భూములను ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందా అని ప్రశ్నించిన ఆయన, నాదర్‌గుల్, వట్టి నాగులపల్లి, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై కూడా ఆరోపణలు చేశారు. ఫీనిక్స్ సంస్థకు సంబంధించిన భూ బదలాయింపులు, భారీ విలువైన లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని, తాను చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇవి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు మాత్రమే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!