

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సర్’ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సరైన సహకారం అందించడం లేదని, దీనివల్ల క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు అధికారులు పూర్తిగా చేరుకోలేకపోతున్నారని అన్నారు. హిందువులంతా అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో తెలంగాణలో వారు మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తూ, రెండు పార్టీలు కలిసి ప్రజలపై భారీ అప్పుల భారం మోపాయని ఆరోపించారు.
వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాచారం, దమ్మన్నపేట, దేశాయ్ పేట, మన్నెగూడెం, గంబీర్ పూర్, పోసానిపేట, దూంపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, బస్టాండ్ వంటి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, గ్రామీణ అభివృద్ధి నిధులను వేరే అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!