

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన.. వాజ్‌పేయి ఆరేళ్లకు పైగా దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. జాతీయ రహదారుల నిర్మాణం, టెలికాం రంగంలో సంస్కరణలు, సామాన్యులకు గ్యాస్ కనెక్షన్ల విస్తరణ వంటి చర్యలు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. అధికారానికి మించిన ప్రాధాన్యతను ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చిన వాజ్‌పేయి రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.
వాజ్‌పేయి నిస్వార్థ దేశభక్తి, సేవాభావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందించిందని రామచందర్‌రావు తెలిపారు. వాజ్‌పేయి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శకత్వం యువతకు ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, సమాజ సేవ, మానవ సేవకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!