

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ను రాజకీయ కక్షసాధింపుకు నిదర్శనంగా పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయడం, వారిని వేధించడం ఈ ప్రభుత్వానికి తెలిసిన పనిగా మారిందని ఆరోపించారు. అప్పలరాజు అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన అన్నారు.
అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన మాత్రమేనని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ అప్పలరాజు కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని జగన్ విమర్శించారు. టీడీపీ నాయకులు ప్రమాదాలకు కారణమైన సందర్భాల్లో ఇలాంటి హత్య కేసులు నమోదు చేశారా అని ప్రశ్నించారు. సొంత కష్టంతో డాక్టర్‌గా ఎదిగిన సీదిరి అప్పలరాజుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుందని, న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే అప్పలరాజు విడుదలవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!