

డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ ఓడిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మార్క్ వా, మాథ్యూ హెడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమైందని, ఈ తరహా ఘోర పరాజయాన్ని తాము నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరాజయమని మాజీ ఆటగాడు మార్క్ వా అభివర్ణించాడు. 'మూడేళ్ల క్రితం గబ్బా వేదికగా వెస్టిండీస్ చేతిలో కూడా ఖంగుతిన్నారు. అయితే ఇది అంతకంటే దారుణమైన ఓటమి. బంగ్లాదేశ్ ప్రధాన బౌలర్లు నహీద్ రాణా, షోరిఫుల్ ఇస్లామ్ లేరు. అలానే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓడింది. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చేదు అనుభవంగా ఇది మిగిలిపోతుంది' అని మార్క్ వా పేర్కొన్నాడు.
మరోవైపు ఈ పరాజయాన్ని 'అత్యంత అవమానకరం'గా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభివర్ణించాడు. జట్టులో తక్షణమే మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. 'సాధారణంగా జట్టులో మార్పులు చేయడాన్ని నేను స్వాగతించను. కానీ ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమితో టాప్ ఆర్డర్‌ను పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓపెనింగ్ స్థానంతో పాటు మూడో స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి' అని పాంటింగ్ సూచించాడు.జట్టు ప్రదర్శనపై మాథ్యూ హెడెన్ కూడా స్పందించాడు. 'ట్రావిస్ హెడ్‌కు ఓపెనింగ్ సరైన స్థానం కాదు. అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు బలం. అలెక్స్ కారీని ఐదో స్థానంలో పంపడం సరైన నిర్ణయం కాదు. మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు, సామ్ కొన్‌స్టాస్ వంటి యువ ఆటగాళ్లను లేదా ఫామ్‌లో ఉన్న మ్యాచ్ ఫిట్ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవాలి' అని అభిప్రాయపడ్డాడు. కాగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం తమ శిక్షణను సమర్థించుకుంటూనే, రెండో టెస్టుకు జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!