

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ల ఆరోగ్య ఖర్చుల కోసం ఇప్పటివరకు అందిస్తున్న రూ.10 లక్షల ఏకకాల ఆర్థిక సాయాన్ని రూ.15 లక్షలకు పెంచనుంది. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరీనాథ్ ఈ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో వైద్య ఖర్చులను ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లకు మరింత ఆర్థిక సహాయం అందనుంది.
మరోవైపు మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల పింఛను పథకంలోనూ మార్పులు చేయాలని చాముండేశ్వరీనాథ్ కోరారు. ప్రస్తుతం కనీసం 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు నెలకు రూ.30 వేల పింఛను అందుతోంది. ఈ పథకాన్ని 5 నుంచి 24 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు కూడా వర్తింపజేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ మార్పు అమలైతే మరింత మంది మాజీ దేశవాళీ క్రికెటర్లకు పింఛను ప్రయోజనం అందే అవకాశం ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!