

ఝార్ఖండ్ టీ20 లీగ్ 2026 ఫైనల్ సందర్భంగా రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వెలుపల తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో పలువురు అభిమానులు గాయపడ్డారు. జంషెడ్‌పూర్ స్టీలర్స్, చోటా నాగ్‌పూర్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. అయితే ప్రేక్షకుల ప్రవేశానికి కేవలం వెస్ట్ గేట్ మాత్రమే తెరిచి ఉంచడంతో భారీ రద్దీ ఏర్పడింది.
భద్రతా తనిఖీలు నెమ్మదిగా సాగడంతో బయట వేచి ఉన్న అభిమానుల్లో అసహనం పెరిగి తోపులాటకు దారితీసింది. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొందరు కిందపడిపోగా, మరికొందరు గాయపడ్డారు. అభిమానుల ఒత్తిడికి బారికేడ్లు, గేట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరూ తీవ్రంగా గాయపడలేదని నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరిగింది. ఈ ఘటన క్రీడా వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రేక్షకుల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!