

భారత స్టార్, ప్రపంచ నంబర్‌వన్ పారా ఆర్చర్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజదా సీదాన్‌తో శీతల్ హోరాహోరీగా తలపడింది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఇద్దరి స్కోర్లు 144-144తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించారు. ఐజదా 9 పాయింట్లు సాధించగా.. శీతల్ 10 పాయింట్లతో అదరగొట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరులో ఇరాక్‌కు చెందిన సారా-అబ్బాస్ జోడీని 157-145తో ఓడించింది.
ఆఖరి రోజు ఇతర విభాగాల్లోనూ భారత ఆర్చర్లు సత్తా చాటారు. పారాలింపిక్ చాంపియన్ హర్విందర్ సింగ్, భావన జోడీ రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్ కిరోంగ్-జియా లీ జోడీని 6-0తో ఓడించి స్వర్ణం సాధించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ప్లేఆఫ్‌లో భావన 6-0తో భారత్‌కే చెందిన రాజశ్రీ రాథోడ్‌పై విజయం సాధించి కాంస్యం దక్కించుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత మూడోస్థానం పోరులో సరిత 141-140తో చైనాకు చెందిన వాంగ్ హుటింగ్‌ను ఓడించి కాంస్యం గెలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ప్లేఆఫ్‌లో తోమన్ కుమార్ 143-138తో ఇరాక్‌కు చెందిన అబ్బాస్ ఖాదిమ్‌పై గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో పోటీల చివరి రోజున భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు చేరాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!