

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) తొలి అంకం విజయవాడలో జరిగిన వేలంతో ముగిసింది. నాలుగు ఫ్రాంచైజీలు మొత్తం 191 మంది నమోదిత క్రీడాకారిణుల్లో 74 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఆల్‌రౌండర్ హెర్నిటా ఫ్లావియా పెరీరా అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను గోదావరి గోల్డెన్ ఈగల్స్ రూ.4.30 లక్షలకు దక్కించుకుంది. అంజలి శర్వాణి రూ.3.60 లక్షలు, అయేషా సింగ్ రూ.2.40 లక్షలతో వైజాగ్ ఫైర్‌బర్డ్స్ జట్టులోకి వెళ్లారు.
అమరావతి ఈ ఛాంపియన్స్ ఆల్‌రౌండర్లు, గ్రేడ్-ఏ క్రీడాకారిణులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ జట్టులో ఏకంగా 11 మంది ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. రాయలసీమ జెన్ స్టార్స్ వేములపాటి సేతుసాయిని రూ.2.10 లక్షలకు, స్టార్ స్పిన్నర్ శ్రీచరణిని రూ.1.10 లక్షలకు తీసుకుంది. 12 ఏళ్ల సాయి షణ్ముఖప్రియ WAPLలో పాల్గొనే పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆమె కూడా రాయలసీమ జెన్ స్టార్స్ తరఫున బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 15న మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో WAPL ప్రారంభం కానుంది. లీగ్ అంబాసిడర్ మిథాలీ రాజ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు, ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ తదితరులు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!