

దేశీయ వైద్య సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఏఐ సాయంతో ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎక్కువ మంది రోగులకు సేవలు అందించగలుగుతున్నారని ఫిలిప్స్ ఫ్యూచర్ హెల్త్ ఇండెక్స్ 2026 నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 50% మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఏఐ తమ సామర్థ్యాన్ని పెంచిందని చెప్పగా, భారత్‌లో ఈ సంఖ్య 71%గా ఉంది. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవడంలో ఏఐ కీలకంగా మారుతోందని నివేదిక పేర్కొంది. రోగుల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేందుకు ఏఐ ఉపకరిస్తుందని భారత్‌లోని 85% మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు విశ్వసిస్తున్నారు.
వైద్య సేవల నాణ్యత, రోగుల భద్రతను మెరుగుపరచడంలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. గత మూడు నెలల్లో కనీసం మూడు సార్లు వైద్యపరమైన పొరపాటును గుర్తించడానికి లేదా నివారించడానికి ఏఐ సాయపడిందని 48% మంది భారత ఆరోగ్య సంరక్షణ నిపుణులు తెలిపారు. ఏఐ కారణంగా వైద్యులు వారానికి సగటున 10 మంది అదనపు రోగులను చూడగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఏఐ సహాయపడగలదని 80% మంది నిపుణులు విశ్వసిస్తున్నారని ఫిలిప్స్ భారత ఉపఖండ ఎండీ భరత్ సెషా తెలిపారు. వైద్యులతో గడిపే సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి జనరేటివ్ ఏఐ సహాయపడిందని 68% మంది తెలిపారు. 10 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, 20,000 మందికి పైగా రోగుల అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందించారు. ఇందులో భారత్‌కు చెందిన 200 మంది ఆరోగ్య నిపుణులు, 2,000 మందికి పైగా రోగులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!