

సైబర్ సెక్యూరిటీ క్యాప్చర్-ది-ఫ్లాగ్ పరీక్షల సందర్భంగా ఐసోలేటెడ్ టెస్టింగ్ వాతావరణం పొరపాటున ఇంటర్నెట్కు అనుసంధానమై ఉండటంతో క్లాడ్ ఏఐకి చెందిన మూడు మోడళ్లు వేర్వేరు సంస్థల లైవ్ సిస్టమ్‌లలోకి ప్రవేశించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఓపెన్ఏఐ ఇటీవల వెల్లడించిన ఇలాంటి సంఘటన అనంతరం నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బయటపడింది. పరీక్షలలో భాగంగా అందుబాటులో ఉన్న ప్రతి సిస్టమ్ సిమ్యులేషన్‌లో భాగమేనని భావించిన ఏఐ మోడళ్లు బలహీనమైన పాస్వర్డ్లు, బహిర్గతమైన క్రెడెన్షియల్స్, ధృవీకరణ లేని ఎండ్పాయింట్లను ఉపయోగించి తమ టాస్క్‌లను పూర్తి చేశాయి.
ఈ ఘటనల్లో క్లాడ్ ఓపస్ 4.7, క్లాడ్ మైథోస్ 5, అలాగే ఒక అంతర్గత పరిశోధనా మోడల్ పాల్గొన్నాయి. ఒక మోడల్ ప్రొడక్షన్ డేటాబేస్‌ను యాక్సెస్ చేయగా, మరో మోడల్ తాత్కాలికంగా PyPIలో హానికరమైన పైథాన్ ప్యాకేజీని ప్రచురించింది. మరో పరిశోధనా మోడల్ ఇంటర్నెట్కు అనుసంధానమైన సిస్టమ్‌లను స్కాన్ చేసిన తర్వాత అది లైవ్ వాతావరణమని గుర్తించి తన చర్యలను నిలిపివేసింది. ఘటన అనంతరం అన్ని సైబర్ పరీక్షలను నిలిపివేసిన ఆంథ్రోపిక్, సంబంధిత సంస్థలకు సమాచారం అందించి, స్వతంత్ర సమీక్షను ప్రారంభించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!