

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారతీయ ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులపై చూపించే అభిమానం ఎంతో ప్రత్యేకమని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘వారణాసి’ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానుల స్పందన తనను ఆశ్చర్యపరిచిందని, ఆయన క్రేజ్ చూసి తనకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పారు. ‘వారణాసి’ తన తొలి పూర్తిస్థాయి తెలుగు సినిమా అని, తెలుగు ప్రేక్షకులు తనను, పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఆత్మీయంగా స్వాగతించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు భాష తెలియకపోవడం తొలుత సవాలుగా అనిపించినప్పటికీ, రాజమౌళి తనపై ఉంచిన నమ్మకం, ప్రతి సన్నివేశంలో అందించిన సహకారం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు.
రాజమౌళి తన పాత్ర కోసం తననే ఊహించుకున్నానని చెప్పడంతో వెంటనే సినిమాను అంగీకరించినట్లు ప్రియాంక తెలిపారు. కీలక సన్నివేశాలకు ముందే రాజమౌళి నిర్వహించే రిహార్సల్స్ నటీనటులకు ఎంతో ఉపయోగపడతాయని, షూటింగ్ సమయంలో పాత్రను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవి సహాయపడతాయని చెప్పారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు ప్రాక్టికల్ సెట్స్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం సినిమాకు సహజత్వాన్ని తీసుకొస్తుందని అన్నారు. ఆఫ్రికాలో నిజమైన క్రూరమృగాలు, ఏనుగుల మధ్య సురక్షిత వాతావరణంలో షూటింగ్ చేయడం తన కెరీర్‌లో ప్రత్యేక అనుభూతిగా నిలిచిందని పేర్కొన్నారు. ‘వారణాసి’ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమాతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుందని ప్రియాంక చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!