

భారత్-యూకే మధ్య గత ఏడాది జూలై 24న కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) కింద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా భారత స్టీల్ పరిశ్రమకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. యూకే ఏటా 11 లక్షల టన్నులకు పైగా భారత స్టీల్‌ను జీరో డ్యూటీతో దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది.
ఈ ఎఫ్‌టీఏతో యూకే నుంచి భారత్‌కు పెట్టుబడులు పెరిగి దేశీయ తయారీ రంగానికి ఊతం లభించనుంది. వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, నగల తయారీ వంటి శ్రమ సాంద్రిత రంగాలకు ఇది మరింత ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి యూకేకు వెళ్లే 99 శాతం వస్తు, సేవలు, అలాగే యూకే నుంచి భారత్‌కు వచ్చే 90 శాతం వస్తు, సేవలు జీరో లేదా తక్కువ సుంకాల పరిధిలోకి రానున్నాయి. దీంతో భారత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఎఫ్‌టీఏ అమలైన తొలి రోజే భారత్ నుంచి యూకేకు 14 కోట్ల డాలర్లు (రూ.1,344 కోట్లు) విలువైన ఎగుమతులు సుంకం లేకుండా జరిగాయని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!