

దేశంలో ప్రాంతీయ విమానయాన సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో సీప్లేన్ ఆపరేటర్ స్కైహాప్ ఏవియేషన్, నార్వేకు చెందిన నోమి ఏరోస్పేస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు దక్షిణాసియాలో విద్యుత్ సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టే అవకాశాలపై ఇరు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేయనున్నాయి. 2029-30 నాటికి నోమి ఏరోస్పేస్ నుంచి 10 విద్యుత్ సీప్లేన్లను కొనుగోలు లేదా లీజు పద్ధతిలో తీసుకోవాలని స్కైహాప్ లక్ష్యంగా పెట్టుకుంది. పనితీరు ఆధారంగా మరో ఐదు విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉంది.
2030 నాటికి మొత్తం 40 సీప్లేన్లను సమకూర్చుకోవాలని స్కైహాప్ యోచిస్తోంది. ఇందులో 20-25 శాతం విద్యుత్, హైబ్రిడ్ సీప్లేన్లు ఉండనున్నాయి. భవిష్యత్తులో వీటిని భారత్లోనే తయారు లేదా అసెంబుల్ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. తొలి దశలో లక్షద్వీప్ దీవులను పరస్పరం అనుసంధానించడంతో పాటు, వాటిని ప్రధాన భూభాగంతో కలపడానికి 19 సీట్ల ట్విన్ ఒట్టర్ సీప్లేన్లను వినియోగించనున్నారు. విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాని నీటి ప్రాంతాలకు సీప్లేన్లు సమర్థవంతమైన రవాణా మార్గంగా ఉపయోగపడతాయని స్కైహాప్ వ్యవస్థాపకురాలు, సీఈఓ అవని సింగ్ తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!