

ఈ ఏడాది పండగల సీజన్‌లో దేశవ్యాప్తంగా 2.5-2.7 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ, టాలెంట్ సంస్థ అడెక్కో ఇండియా అంచనా వేసింది. ఈ-కామర్స్, లాజిస్టిక్స్, క్విక్ కామర్స్, వ్యవస్థీకృత రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో నియామకాలు పెరగనున్నాయని తన నివేదికలో పేర్కొంది. తాత్కాలిక, గిగ్ నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 15-20 శాతం పెరగవచ్చని తెలిపింది.
ఈ ఏడాది సిబ్బంది డిమాండ్‌లో సుమారు 45 శాతం లఖ్‌నవూ, భువనేశ్వర్, జైపూర్, కోయంబత్తూరు వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తరణ, వ్యవస్థీకృత రిటైల్ వృద్ధి, వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు ప్రతిభ కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఉద్యోగుల వలసలు, గిగ్ వర్క్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా సిబ్బంది నియామకాలు, నిలుపుదల సవాలుగా మారుతున్నాయని వివరించింది.
మెట్రో నగరాల్లో తాత్కాలిక వేతనాలు 12-15 శాతం, ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో 8-10 శాతం పెరిగే అవకాశం ఉందని అడెక్కో ఇండియా పేర్కొంది. రిటైల్ సేల్స్ అసోసియేట్లు, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్‌లు, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, మర్చంటైజర్లు, BFSI సిబ్బందికి డిమాండ్ అధికంగా ఉండనుంది. హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషలపై పట్టు, డిజిటల్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!