

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas LLP) జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా తమ వద్దే ఉంచుకుందని వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) తేల్చింది. ఈ మేరకు ఏఎంబీ సినిమాస్ రూ.1.1 కోట్లు కేంద్ర, రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధుల్లో జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. తెలంగాణలోని మరో ఐదు థియేటర్లపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటూ, మొత్తం ఆరు థియేటర్లు కలిపి సుమారు రూ.1.7 కోట్లు వినియోగదారుల సంక్షేమ నిధులకు జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
2019 జనవరి 1 నుంచి సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లు తగ్గినా, ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా బేస్ టికెట్ ధరలను పెంచి తుది టికెట్ ధరలను దాదాపు యథాతథంగా కొనసాగించినట్లు ట్రైబ్యునల్ గుర్తించింది. ఇది కేంద్ర జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 171 యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఏఎంబీ సినిమాస్ నిర్వహణ వ్యయాలు పెరిగాయని, టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఉన్నాయని వాదించినప్పటికీ ట్రైబ్యునల్ ఆ వాదనలను తిరస్కరించింది. కొన్ని థియేటర్లకు 18 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించినప్పటికీ, ఉల్లంఘనలు 2020 జనవరి 1కు ముందే జరిగినందున ఎలాంటి జరిమానాలు విధించలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!