

హోల్డింగ్ కంపెనీల ఆదాయం ప్రధానంగా ఇతర సంస్థల్లోని పెట్టుబడులు, వాటిపై వచ్చే డివిడెండ్ల నుంచి ఉండటంతో మార్కెట్ సాధారణంగా వాటికి డిస్కౌంట్ ఇస్తుంది. అయితే, సొంతంగా బలమైన వ్యాపారాన్ని నిర్వహిస్తూ, లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విలువైన వాటాలు కలిగి ఉన్న సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. భవిష్యత్తులో ఆ పెట్టుబడుల విలువ పెరగడం లేదా అన్‌లాక్ కావడం ద్వారా షేర్‌హోల్డర్లకు అదనపు ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది.
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీకి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. సైకిళ్లు, ఇంజినీరింగ్, మొబిలిటీ, ఈవీ, పారిశ్రామిక పరికరాల వ్యాపారాలతో పాటు సీజీ పవర్, శాంతి గేర్స్ వంటి సంస్థల్లో గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఇన్ఫో ఎడ్జ్ నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్‌సాథీ, శిక్షా వంటి వ్యాపారాలను నిర్వహించడంతో పాటు జొమాటో, పాలసీబజార్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. దీంతో ఇది ఒక రకంగా లిస్టెడ్ వెంచర్ క్యాపిటల్ ప్లాట్‌ఫామ్‌లా కనిపిస్తుంది.
ఈఐడీ ప్యారీ చక్కెర, న్యూట్రాస్యూటికల్స్, బయో ఉత్పత్తుల వ్యాపారాలతో పాటు కోరమండల్ ఇంటర్నేషనల్‌లో 56 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలు, ట్రాక్టర్లు, ఈవీ రంగాల్లో బలమైన వ్యాపారంతో పాటు పలు గ్రూప్ కంపెనీల్లో వాటాలను కలిగి ఉంది. లార్సన్ అండ్ టూబ్రో ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఆధిపత్యంతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు కలిగి ఉంది.
ఇలాంటి కంపెనీలను విశ్లేషించేటప్పుడు లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లోని వాటాల విలువతో పాటు సొంత వ్యాపారం, నగదు నిల్వలు, రుణాలు, పన్నులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. హోల్డింగ్ కంపెనీల వాటాలను విక్రయించడం సులభం కాకపోవడం, క్యాపిటల్ గెయిన్స్ పన్ను వంటి కారణాలతో ఇవి తరచూ వాటి అంతర్గత విలువ కంటే 30–40 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతుంటాయి. అందువల్ల మార్కెట్ ధరకు, వాస్తవ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!