

మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ ఐపీవో మార్కెట్ మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈక్విరస్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 23 సంస్థలు సుమారు ₹27,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సాగాన్ న్యూట్రిషన్ సంస్థలు ఈ నెలలోనే ఇష్యూలను ప్రారంభించగా, టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్, అద్విత్ జ్యువెల్స్ సంస్థల ఇష్యూలు ఈ నెల 19, 23 తేదీల్లో ప్రారంభంకానున్నాయి. కార్డీలియా క్రూయిజ్లను నిర్వహిస్తున్న వాటర్వేస్ లీజర్ టూరిజం సంస్థ కూడా ఈ నెలలోనే ఇష్యూకు రానుంది.
ఈ ఏడాది మే నెల నాటికి 236 సంస్థలు పబ్లిక్ ఇష్యూల సన్నాహాల్లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వీటిలో 163 సంస్థలకు నియంత్రణ సంస్థ అనుమతి లభించగా, మరో 73 సంస్థలు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. 2025లో 103 ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో ₹1.76 లక్షల కోట్లు సమీకరించగా, 2024లో 90 సంస్థలు ₹1.60 లక్షల కోట్లు, 2023లో 57 సంస్థలు ₹49,436 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నాలుగు సంస్థలు ₹2,422 కోట్లు, తొలి త్రైమాసికంలో 19 సంస్థలు ₹24,772 కోట్లు సమకూర్చుకున్నాయి.
టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్ ఇష్యూ జూన్ 19న ప్రారంభమై ఈ నెల 23న ముగియనుంది. జూన్ 29న మార్కెట్లో జాబితా కానుంది. ఈ ఇష్యూ ద్వారా సంస్థ ₹883 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరను ₹144 నుంచి ₹152 మధ్య నిర్ణయించారు. ఇందులో ₹660.72 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయగా, ₹221.95 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. మరోవైపు నెలకు ₹30,000 కోట్లకు పైగా క్రమబద్ధ పెట్టుబడులు మార్కెట్లోకి రావడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!