

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ప్రతీకగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలకు భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు బోనాల పండుగలో పాల్గొంటారని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, రాష్ట్రంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!