

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తైంది. గతేడాది ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ అందిస్తుండగా, ఏడాదిలో రూ.3,095 కోట్లు ఖర్చు చేసింది.
ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 9,978 ఆర్టీసీ బస్సుల్లో 7,631 బస్సులు, అంటే 76 శాతం బస్సులను స్త్రీ శక్తి పథకానికి వినియోగిస్తున్నారు. ఆలయాలకు నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా 40 శాతం ఉండగా, ప్రస్తుతం 62 శాతానికి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరుకుంది. పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 93 శాతానికి చేరింది. పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!