

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది తాగునీటికే తొలి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ తర్వాత పరిశ్రమలకు, ఉద్యాన పంటలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యతను బట్టి మాత్రమే పంటల సాగు చేపట్టాలని, తొందరపడి వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణంగా 867 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 557 మి.మీ. మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇది 35.5 శాతం లోటుగా పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో లోటు 42 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. నీటి పొదుపు కోసం క్షేత్రస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రిజర్వాయర్లలో నీటిని సమర్థంగా వినియోగించడం వల్ల 2025లో 953 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని, ప్రస్తుతం అదే రాష్ట్రానికి రక్షణగా నిలిచిందన్నారు.
వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు డ్రిప్, మల్చింగ్, షేడ్‌నెట్, ఫారం పాండ్స్ వంటి విధానాలను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రైతులు పంటల బీమాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 35.17 లక్షల మంది బీమా నమోదుచేసుకున్నారని వెల్లడించారు. 23 లక్షల ఎకరాల్లో పోస్ట్ మాన్సూన్ డ్రై సోయింగ్ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 17 లక్షల ఎకరాలు పూర్తయ్యాయని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి రూ.35,555 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి 19.16 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. పోలవరం తొలి దశను 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామని, వెలిగొండ, హంద్రీ-నీవా, గుంటూరు ఛానల్, వరికపూడిశెల, నేరడి బ్యారేజీ, తోటపల్లి ప్రాజెక్టుల పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!