

తెలంగాణలో తొలి దశ జనగణన ప్రక్రియ పూర్తికాగా, రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర జనాభా లెక్కల విభాగం గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించింది. ఇంకా ఎవరైనా కుటుంబాలు లెక్కల్లో నమోదు కాకపోతే సమీపంలోని మున్సిపల్ లేదా పంచాయతీ కార్యాలయాలకు గురువారం లోపు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. 2011 జనగణనలో తెలంగాణ ప్రాంత జనాభా 3.50 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
గత 16 ఏళ్లలో రాష్ట్రంలో సుమారు 70 లక్షల జనాభా పెరిగినట్లు, వార్షిక వృద్ధి రేటు 1.25 శాతంగా నమోదైనట్లు అధికారులు భావిస్తున్నారు. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనాభా కోటిన్నర దాటే అవకాశం ఉందని అంచనా. అలాగే 2011లో 83 లక్షలుగా ఉన్న కుటుంబాల సంఖ్య ప్రస్తుతం సుమారు కోటి 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. రెండో దశ జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనుండగా, అప్పట్లో ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. అనంతరం రెండు దశల సమాచారాన్ని సమీకరించి 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో అధికారిక జనాభా గణాంకాలను విడుదల చేసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!