

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SET)ను ఏర్పాటు చేసింది. ధరణి ప్రారంభం నుంచి విక్రేత ఎంపిక, టెండర్ ప్రక్రియ, పోర్టల్ రూపకల్పన, సాంకేతిక లోపాలు, డేటా భద్రత వరకు అన్ని అంశాలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్-1) శాఖ జులై 25న జి.ఓ.ఎంఎస్ నెం.173ను జారీ చేసింది. సీఐడీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం టెండర్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందా? కాంట్రాక్టు పొందిన సంస్థ యాజమాన్యంలో మార్పులు జరిగాయా? విదేశీ సంస్థలు లేదా పన్ను స్వర్గధామాలతో సంబంధాలున్నాయా? వ్యక్తిగత, భూముల సమాచార భద్రతకు ముప్పు ఏర్పడిందా? అనే అంశాలను పరిశీలించనుంది.
ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని అనధికార అనుమతులు, అవసరమైన చెల్లింపులు లేకుండానే లావాదేవీలు, అనధికార వ్యక్తుల జోక్యం, అసాధారణ సమయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయా అనే అంశాలపైనా SET దృష్టి సారించనుంది. సిస్టమ్ లాగ్లు లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్రస్లు నమోదు కాకపోవడం, ట్రాన్సాక్షన్ ఐడీలను ఆధార్ లావాదేవీలతో అనుసంధానం చేయడంలో లోపాలు ఉన్నాయా అనే విషయాలను కూడా పరిశీలించనుంది. అక్రమాలకు బాధ్యులైన వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించి తదుపరి చర్యలకు సిఫారసు చేయడంతో పాటు అవసరమైతే కేసులను ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైన డేటా భద్రత అంశాలపై మధ్యంతర నివేదికలు సమర్పించేందుకు కూడా బృందానికి అవకాశం కల్పించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!