

జగన్మాత దుర్గమ్మ అలంకరణ కోసం రూ.11 లక్షల విలువైన బంగారు జడను దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) కుటుంబం ఆదివారం విరాళంగా అందించింది. లక్ష్మీదేవి, ఇతర దైవిక రూపాలతో రూపొందించిన ఈ బంగారు జడలో ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలను పొదిగారు. సుమారు 20 ఏళ్ల క్రితం దుర్గగుడికి వచ్చినప్పుడు అమ్మవారికి బంగారు జడ చేయించాలని సంకల్పించినట్లు రాధాకృష్ణ తెలిపారు. పాలకమండలి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో ఆ మొక్కును నెరవేర్చినందుకు సంతృప్తిగా ఉందన్నారు.
తనతో పరిచయం ఉన్న మిత్రులు స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధి, అన్నదానం, ఉచిత ప్రసాదం, బంగారం, వెండి ఆభరణాలు, గోసంరక్షణ కార్యక్రమాల కోసం తన హయాంలో మొత్తం రూ.1.16 కోట్ల విరాళాలు అందించారని రాధాకృష్ణ తెలిపారు. మరో 15 రోజుల్లో రూ.75 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అమ్మవారికి విరాళంగా అందించేందుకు తన మిత్రుడు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాదశర్మ, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, శ్రీధర్శర్మ, ఈఈ రమాదేవి, పాలకమండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, రాఘవరాజు, సరిత తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!