

విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం సమగ్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణపై గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. శ్రావణ మాసంలోగా నూతన అన్నప్రసాద భవనం మరియు ప్రసాదం తయారీ పోటు (లడ్డూ పోటు) నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంద్రకీలాద్రికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మల్టీ లెవల్ పార్కింగ్, రెండవ ఘాట్ రోడ్ నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై మాస్టర్ ప్లాన్ రూపకర్తలతో అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా భక్తుల సంతృప్తి స్థాయిని మరింత పెంచడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!