

ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఆగస్టు 31 నుంచి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు ఓటీఆర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. దరఖాస్తుల్లో పొరపాట్లను సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సవరించుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100గా నిర్ణయించగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తులను ఇండియా పోస్ట్ అధికారిక జీడీఎస్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా సమర్పించాలి.
బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష చదివి ఉండటం తప్పనిసరి. అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. BPM పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు TRCA వేతన శ్రేణిని నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ పోస్టల్ సర్కిల్‌లో 917, తెలంగాణ సర్కిల్‌లో 419 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు సాధారణంగా రోజుకు సుమారు నాలుగు గంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలకు సంబంధించి అదనపు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. విధుల నిర్వహణ కోసం కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాలను శాఖ అందిస్తుంది. సంబంధిత పోస్టాఫీసుకు సమీపంలో నివాసం ఉండటం తప్పనిసరి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!