

అందరికీ అన్ని రకాల మందులు ఒకే విధంగా సరిపోవు. కొంతమందిలో ఔషధాలు దుష్ప్రభావాలకు లేదా రియాక్షన్స్‌కు కారణమయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, గతంలో వాడిన మందులు, వాటి వల్ల ఎదురైన సమస్యలు తదితర అంశాలను వైద్యులు పరిగణనలోకి తీసుకుని మందులను సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో గతంలో ఏదైనా మందు పడకపోయినట్లు రోగి చెబితే వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మందు వల్ల రియాక్షన్ వస్తే చర్మంపై దద్దుర్లు, దురద, మచ్చలు, ఆయాసం, ముఖం లేదా కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మరో మందు వేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏ మందులు వాడారో తెలిపే ప్రిస్క్రిప్షన్‌ను కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్‌ను విచ్చలవిడిగా వాడితే మూత్రపిండాలు, కాలేయంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మందులను ఏ ద్రవంతో తీసుకుంటున్నామన్నదీ ముఖ్యమే. సాధారణంగా వైద్యులు సూచన లేకపోతే మందులను మంచి నీటితోనే వేసుకోవాలని చెబుతున్నారు. పాలు, టీ, కాఫీ, మజ్జిగ లేదా పండ్ల రసాలతో కొన్ని మందులు తీసుకోవడం వల్ల వాటి ప్రభావంలో మార్పులు రావచ్చు. ముఖ్యంగా కొన్ని పండ్ల రసాలతో మందులు తీసుకుంటే రక్తపోటులో మార్పులు, కడుపునొప్పి, వాంతులు, చెమటలు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్, సొరియాసిస్, కీళ్లవాతం, హెచ్‌ఐవీ, క్షయ వంటి వ్యాధులకు చికిత్స పొందుతున్నవారు, గర్భిణులు, బాలింతలు, తక్కువ బరువు ఉన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తం ఎక్కించే సమయంలో వచ్చే ప్రతికూల ప్రతిచర్యలను హీమోవిజిలెన్స్ కింద పర్యవేక్షిస్తారు. టీకాల అనంతరం వచ్చే ప్రతికూల ఘటనలను ఏఈఎఫ్‌ఐగా నమోదు చేస్తారు. ఔషధ దుష్ప్రభావాలను రోగులు మాత్రమే కాకుండా వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, వైద్య విద్యార్థులు కూడా సంబంధిత ఫార్మకోవిజిలెన్స్ కేంద్రాలకు నివేదించవచ్చు. మందులను వైద్యులు సూచించిన మోతాదు, వ్యవధిలోనే వాడాలి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వైద్యుల ప్రిస్క్రిప్షన్, పర్యవేక్షణతో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!