

కెనడాలోని క్యూబెక్‌లో ఎనిమిదేళ్లుగా జీవిస్తున్న భారతీయ కుటుంబం.. శరణార్థి హోదా, మానవతా ప్రాతిపదికన దేశంలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో భారత్‌కు తిరిగి వచ్చింది. హరీష్ కుమార్, ఆయన భార్య సోనిక, ఇద్దరు కుమారులు జపేష్ (14), గౌలాష్ (12) సెప్టెంబర్ 7న విమానంలో భారత్‌కు చేరుకున్నారు. కెనడాలోనే పెరిగిన పిల్లలు దేశాన్ని వీడాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఇక్కడే పెరిగాను. నాకు ఇక్కడే స్నేహితులు ఉన్నారు. భారతదేశంలో నాకేమీ లేదు” అని జపేష్ చెప్పాడు.
ఈ బహిష్కరణను వలసదారుల హక్కుల కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ సెంటర్ తీవ్రంగా ఖండించింది. కొవిడ్ సమయంలో హరీష్ ట్రక్ డ్రైవర్‌గా సేవలందించారని, అప్పట్లో ‘ఎసెన్షియల్ వర్కర్’గా గుర్తించినప్పటికీ.. అనంతరం ఆయన కుటుంబానికి కెనడాలో ఉండే అవకాశం లేకపోయిందని పేర్కొంది. అయితే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు.. చట్టపరమైన అన్ని మార్గాలు పూర్తయిన తర్వాతే బహిష్కరణ నిర్ణయాలు అమలు చేస్తామని తెలిపారు. పంజాబ్‌లోని గొరాయాలో కిరాణా దుకాణం నిర్వహించిన హరీష్.. రాజకీయ ఒత్తిళ్లు, తప్పుడు కేసు, పోలీసుల వేధింపుల కారణంగా 2018 ఏప్రిల్‌లో కెనడాకు వచ్చి ఆశ్రయం కోరినట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల న్యాయపోరాటం అనంతరం కుటుంబం భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!