

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుమల పవిత్రత, పరిశుభ్రతను కాపాడటంతో పాటు భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు అందించే బాధ్యత అందరిపైనా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కొన్ని దుకాణాల్లో కాలీఫ్లవర్ (గోబీ)లో పురుగులు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో గోబీని పూర్తిగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ నిషేధం రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీకి హోటల్ నిర్వాహకులు, స్థానికులు సహకరించాలని అధికారులు కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!