

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా రాష్ట్రంలో ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్లపై ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ నిర్వహించనున్నారు. నోటీసుల జనరేషన్, ప్రింటింగ్ ప్రక్రియను ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశించింది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణ తేదీ, వేదిక, సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలను బీఎల్‌వోలు స్పష్టంగా తెలియజేయాలి. ఓటర్లు తమ పత్రాలను ఓటర్ పోర్టల్, బీఎల్‌వో యాప్ లేదా విచారణ సమయంలో నేరుగా సమర్పించవచ్చు. గ్రామ పంచాయతీ భవనాలు, వార్డు కార్యాలయాల్లో విచారణ చేపట్టాలని సూచించారు. ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితాను చదివి వినిపించడంతో పాటు తొలగించిన ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. అప్పీళ్ల కోసం డీఈవో కార్యాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!