

కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపు 70 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి చేపట్టిన దర్యాప్తు వివరాలను హైకోర్టుకు పక్షం రోజులకోసారి నివేదిక రూపంలో సమర్పిస్తున్నామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. చిన్నారి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ న్యాయవాది జి. శ్రీకాంత్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టు దృష్టికి వెళ్లింది. చిన్నారి అదృశ్యంపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఐదు ప్రత్యేక బృందాలు చిన్నారి కోసం గాలిస్తున్నాయని సీఐ వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ తన కుమార్తె జ్ఞాపకాలను, ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రజలకు చేరవేసేందుకు ఆమె పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతుండగా, మరోవైపు తండ్రి గణేష్ కరపత్రాలు పట్టుకుని ఊరూరా తిరుగుతూ తన కుమార్తె ఆచూకీ కోసం ప్రజలను కోరుతున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లభించలేదు. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా చిన్నారి అదృశ్యంపై సమాచారం చేరేలా చేయడం, ఎక్కడైనా జ్ఞానేశ్వరి ఆచూకీకి సంబంధించిన సమాచారం లభిస్తే పోలీసులకు చేరేలా చూడటమే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశమని గణేష్ తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!