

దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఢిల్లీతో పాటు ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎండలు, ఉక్కపోత కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు అక్కడి ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త తెలిపింది. బంగాళాఖాతం ఉత్తర భాగం నుంచి జమ్మూ కశ్మీర్ వరకు సుమారు 1,500 కిలోమీటర్ల మేర రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ద్రోణి క్రమంగా దక్షిణ దిశగా కదులుతుండటంతో జులై 1 నుంచి 4 మధ్య ఉత్తర భారతంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
రుతుపవన ద్రోణి అనేది తేమతో కూడిన గాలులు ఒక రేఖలా ఏర్పడే వాతావరణ వ్యవస్థ. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమను తీసుకువచ్చి అల్పపీడన పరిస్థితులను సృష్టించడం ద్వారా వర్షాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది. ఈ ద్రోణి ఉత్తర దిశలో ఎక్కువకాలం కొనసాగడంతో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఉత్తర భారత ప్రజల వర్షాల నిరీక్షణకు త్వరలో ముగింపు పలకనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!