

గోదావరి పుష్కరాలు-2027ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. ఆగస్టు చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పనుల పురోగతిని రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. రోడ్ల అనుసంధానం, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, పండితులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలను ఏర్పాట్లలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చూడాలని, పుష్కరాల ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!