

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందిస్తూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు (ఏఐ) వల్ల కలిగే ప్రభావమే మరింత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యల కంటే భవిష్యత్తులో ఏఐ విద్యా, ఉద్యోగ వ్యవస్థలను పూర్తిగా మార్చేస్తుందని పేర్కొన్నారు.
గతంలో విద్య అంటే పరిమిత సమాచారాన్ని అందించి ఉద్యోగాలకు సిద్ధం చేయడమైతే, ఇప్పుడు సమాచారానికి కొరత లేదని, ఏఐ మానవ మెదడుకంటే వేగంగా సమాచారాన్ని విశ్లేషించి సమాధానాలు ఇవ్వగలదని ఆయన అన్నారు. అందువల్ల పాత సిలబస్‌లు, సంప్రదాయ నైపుణ్యాలు వేగంగా ప్రాధాన్యం కోల్పోతున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మార్కులు, డిగ్రీల కంటే ఏఐను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడమే అసలైన విద్య అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు కూడా ఏఐ ప్రభావానికి అనుగుణంగా మారకపోతే వాటి విలువ తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కాలానుగుణంగా ఏఐ ఆధారిత విద్యను స్వీకరించాలని ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!