

తెలంగాణ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రూ.33 కోట్లు విడుదల చేయాలన్న హైకోర్టు గత ఉత్తర్వులు అమలు కాకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ నాగేశ్ భీమపాక ఉత్తర్వుల మేరకు సుల్తానియాను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. అయితే రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తే బెయిల్‌పై విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది.
ఈ ధిక్కార పిటిషన్‌ను బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జె. రామకృష్ణ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 18న కంటోన్మెంట్ బోర్డుకు రూ.33 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. పలుమార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ కోర్టు ఆదేశాల అమలులో పురోగతి కనిపించకపోవడంతో హైకోర్టు కఠిన వైఖరి అవలంబించింది. వారెంట్‌ను తక్షణమే అమలు చేసి, దాని అమలు వివరాలు లేదా అమలు చేయలేకపోయిన కారణాలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!