

ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ కొనిచ్చేందుకు గంజాయి విక్రయించాలనుకున్న ఓ యువకుడు, అతడి ప్రియురాలు పోలీసులకు పట్టుబడ్డారు. పెద్దపల్లికి చెందిన మిత్రచైతన్య (21), హేమలత (20) కలిసి ఒడిశాలోని పసుపులంకలో రూ.16 వేలతో 12 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాన్ని హైదరాబాద్‌లో సుమారు రూ.6 లక్షలకు విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వైరాలోని స్థానిక క్రాస్‌రోడ్డులో ఈగల్ ఫోర్స్, వైరా పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి ఆపకుండా పరారయ్యే ప్రయత్నంలో ఎస్‌ఐ పుష్పాల రామారావు వారి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఇద్దరు నిందితులతో పాటు ఎస్‌ఐ స్వల్పంగా గాయపడ్డారు.
నిందితుల నుంచి 12 కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయి విక్రయం ద్వారా వచ్చే డబ్బుతో ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ కొనిచ్చేందుకు మిత్రచైతన్య ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లో గంజాయి స్వీకరించి విక్రయించాల్సిన శశి, నాగుల్, గంజాయి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగవాన్ హంతాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మిత్రచైతన్యపై ఇప్పటికే మూడు ఎన్‌డీపీఎస్ కేసులు ఉన్నాయని, ఈ ఏడాది ఏప్రిల్ 30న జైలు నుంచి పరారైనట్లు విచారణలో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!