

ఉక్రెయిన్‌కు ఆర్టిల్లరీ షెల్స్ కొనుగోలు కోసం కుదిరిన €70 మిలియన్ల (సుమారు రూ.768.50 కోట్లు) ఒప్పందం వివాదంలో చిక్కుకోవడంతో ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ రాజీనామా చేశారు. 2024లో ఉక్రెయిన్‌లో మందుగుండు సామగ్రి కొరత ఉన్న సమయంలో ఎస్తోనియా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటలీలో నమోదైన డేటాసెల్ ఎస్‌ఆర్‌ఎల్ సంస్థకు ఈ ఒప్పందం దక్కగా, అదే ఏడాది ఆ సంస్థను భారత్‌కు చెందిన నెకో డిఫెన్స్ మునిషన్స్ కొనుగోలు చేసింది. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ పీస్ ఫెసిలిటీ నుంచి వచ్చిన నిధులతో ఎస్తోనియా ముందస్తు చెల్లింపులు చేసింది.
అయితే మందుగుండు సామగ్రి సరఫరాలో జాప్యం చోటుచేసుకోవడంతో వివాదం మొదలైంది. 2025లో కొంత సామగ్రి అందినప్పటికీ, వాటి నాణ్యతపై ఎస్తోనియా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఒప్పందాలను రద్దు చేసి నిధుల రికవరీకి ప్రయత్నించింది. అయితే డేటాసెల్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, తాము ఒప్పందం ప్రకారం సామగ్రిని సరఫరా చేశామని పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం మధ్యవర్తిత్వ ప్రక్రియకు చేరింది. ఇదే సమయంలో ఎస్తోనియా నేషనల్ ఆడిట్ ఆఫీస్ రక్షణ రంగంలో నిధుల నిర్వహణ, కాంట్రాక్టుల పర్యవేక్షణలో లోపాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో రాజకీయ బాధ్యత వహిస్తూ పెవ్కుర్ పదవి నుంచి వైదొలిగారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!