

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. సుమారు రూ.440 కోట్ల నిధులు ఉన్న ఈ ఖాతాలపై చర్యలు తీసుకోవడం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు మరింత ఊతమిచ్చింది. తిరుగుబాటు నేత రిత్నబ్రత బెనర్జీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పార్టీ ఖాతాల్లోని నిధులకు సంబంధించి ‘కట్ మనీ’, బలవంతపు వసూళ్లు, ప్రజాధనం దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు కోల్‌కతాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెంట్రల్ ప్లాజా బ్రాంచ్‌లో ఉన్న ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలను నిలిపివేయాలని ఆదేశించారు. మరోవైపు టీఎంసీ నాయకత్వం ఈ చర్యలను రాజకీయ ప్రేరేపితంగా అభివర్ణిస్తూ చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేసింది. అయితే తిరుగుబాటు వర్గం మాత్రం పార్టీ నిధులపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!