

అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. చిత్రబృందం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వివరాలను పరిమితంగానే వెల్లడించింది. కథానాయికగా దీపికా పదుకొణె పేరు అధికారికంగా ఖరారైనప్పటికీ.. మిగతా తారాగణం, పాత్రలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
తాజా బాలీవుడ్ వర్గాల ప్రచారం ప్రకారం.. జాన్వీ కపూర్ ఓ శక్తిమంతమైన గిరిజన యువతిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న పాత్ర దీపికా పదుకొణె పాత్ర చేసే పోరాటానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్రల వివరాలను చిత్రబృందం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. సినిమాలో అతిథి పాత్రలపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. షారుక్ ఖాన్, షాహిద్ కపూర్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. వారి పాత్రల విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ కొనసాగుతున్నట్లు సమాచారం. పురాణ అంశాలను ఆధునిక కాలంతో మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు చిత్రబృందం అధికారికంగా వెల్లడించే వరకు ఆసక్తి కొనసాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!