

శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోగి' సినిమాపై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన రఫ్ కట్‌ను ఇటీవల శర్వానంద్ వీక్షించినట్లు సమాచారం. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, కథనం, దర్శకుడు సంపత్ నంది టేకింగ్ ఆయనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా కథను తెరపై ఆవిష్కరించిన తీరు పట్ల శర్వానంద్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా విడుదలకు ముందే ఈ కాంబినేషన్‌పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. హై-వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను తొలుత ఆగస్టు 28న విడుదల చేయాలని భావించినప్పటికీ, చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం టాకీ పార్ట్‌తో పాటు మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమై ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమా విజయంపై యూనిట్ ధీమాగా ఉండటంతో పాటు, శర్వానంద్-సంపత్ నంది కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలపై కూడా చర్చ కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!