

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ గత శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పుడు చిత్రబృందం మరో కీలక షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. వరుసగా 30 రోజుల పాటు సాగే లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి సంక్రాంతి పండుగకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ పని చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే శర్వానంద్ కూడా తన డేట్స్‌ను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు సినిమా కథకు సంబంధించిన ముఖ్యమైన భాగాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
‘జార్జ్ క్రిష్’లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తెలియని వయసులో ఆవేశంతో హీరో చేసిన ఓ పని కారణంగా అతని జీవితంలో ఎదురయ్యే పరిణామాల చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఈ అంశాన్ని శ్రీను వైట్ల తనదైన శైలిలో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ సినిమాతో తిరిగి బిజీ కావాలని శ్రీను వైట్ల గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. శర్వానంద్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. సంక్రాంతి విడుదల లక్ష్యాన్ని చేరుకునేలా షూటింగ్, నిర్మాణ పనులు వేగంగా సాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!