

‘సయారా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనీత్ పడ్డా తొలి సినిమాతోనే సెన్సేషనల్ విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తుండగా, ప్రస్తుతం అహాన్ పాండేతో ఓ ప్రాజెక్ట్‌తో పాటు ‘శక్తి శాలిని’లోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరో భారీ అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘బ్రహ్మాస్త్ర 2’లో అనీత్ పడ్డా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం మంచి విజయాన్ని అందుకుంది. రెండో భాగంలో రణబీర్ కపూర్ సరసన కీలకమైన విభిన్న పాత్ర కోసం అనీత్ పడ్డా పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం ముగింపులో కనిపించిన సంకేతాల నేపథ్యంలో దీపికా పదుకొణే కీలక పాత్రలో నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్‌లో లేరని ఆమె బృందం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అనీత్ పడ్డాను సంప్రదించినట్లు, ఈ పాత్ర ఆమె ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ అవకాశం ఖరారైతే అనీత్ కెరీర్‌లో ఇదొక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!