

‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే సుదీర్ఘమైన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’ అనేది ఉపశీర్షిక. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయం అవుతుండగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 18న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మిస్టరీ మ్యూజికల్‌గా రూపొందిన ఈ చిత్రం సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా చూపిస్తుంది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించారు. ప్రతిరోజూ రాత్రి సరిగ్గా 10:30 గంటలకు ఓ రేడియో స్టేషన్‌లో ఒకే పాట ప్రసారం కావడం, నెమలిపాలెం నుంచి పలువురు ఆ పాటను కోరుకోవడం చుట్టూ కథ సాగుతుంది. ఈ కథకు తగ్గట్టుగానే సినిమాకు సుదీర్ఘమైన టైటిల్ పెట్టినట్లు చంద్ర సిద్ధార్థ్ తెలిపారు. తన స్నేహితుడు మదన్‌తో కలిసి రూపొందించాలని భావించిన ఈ కథ, ఆయన మరణానికి ముందు ప్లాన్ చేసిన చివరి ప్రాజెక్టుల్లో ఒకటని చెప్పారు. నాలుగు పాటలు ఉన్న ఈ చిత్రానికి జే రెక్స్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!