

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్ పాల్గొని సినిమా గురించి మాట్లాడారు. సేలం నుంచి ‘సిగ్మా’ ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, అక్కడ షూటింగ్ చేసిన రోజులు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించాయని తెలిపారు. చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం తన కుటుంబం గురించి ప్రస్తావించగానే అభిమానులు ఒక్కసారిగా టీవీకే నినాదాలతో హోరెత్తించారు.
అభిమానుల నినాదాలకు సంజయ్ చిరునవ్వుతో థంబ్స్‌అప్ సింబల్ చూపించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల కొన్ని బహిరంగ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో కుటుంబంలో విభేదాలున్నాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ స్పందన ఆసక్తిని రేకెత్తించింది. ‘సిగ్మా’ గురించి సంజయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ‘సిగ్మా మూమెంట్’ ఉంటుందని అన్నారు. కొన్ని నిర్ణయాల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ఎదగాలనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కిందని, సాధారణ వ్యక్తి కథగా రూపొందిన ‘సిగ్మా’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడిగా మారాలన్న తన ఆలోచనను ముందుగా తల్లితో పంచుకున్నానని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!