

2001 సెప్టెంబర్ 11.. ఆధునిక చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటి. ఉగ్రవాదులు నాలుగు ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసి దాడులకు పాల్పడటంతో అమెరికా గగనతలాన్ని మూసివేసింది. దీంతో అమెరికాకు వెళ్లాల్సిన వందలాది అంతర్జాతీయ విమానాలు మధ్యలోనే చిక్కుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో కెనడా ‘ఆపరేషన్ ఎల్లో రిబ్బన్’ను చేపట్టి 238 అంతర్జాతీయ విమానాలను తమ దేశంలోని వివిధ విమానాశ్రయాలకు దారి మళ్లించింది. వీటిలో 224 విమానాలు, 33 వేల మందికిపైగా ప్రయాణికులను ఈ ఆపరేషన్ కింద సమన్వయం చేసినట్లు కెనడా రవాణా శాఖ వివరాలు చెబుతున్నాయి.
ఈ ఘటనలో న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రడార్‌లోని గాండా పట్టణం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. 38 విమానాల్లో 6,500 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 10 వేలలోపు జనాభా ఉన్న ఈ చిన్న పట్టణం ఒక్కసారిగా వేలాది మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చింది. స్థానికులు తమ ఇళ్ల తలుపులు తెరిచి ఆహారం, దుస్తులు, వసతి అందించడంతో పాటు పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలను కూడా ఆశ్రయాలుగా ఉపయోగించారు. ప్రయాణికులు కొన్ని రోజుల పాటు గాండాలోనే ఉండాల్సి వచ్చింది. 9/11 విషాదం తర్వాత గాండా ప్రజలు చూపిన ఈ కరుణ, ఆతిథ్యం ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!