

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియా భవానీ శంకర్ సినిమా, తన పాత్రకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సినిమాలో తాను కావేరి అనే సాధారణ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపిస్తానని ప్రియా తెలిపింది. తాగుబోతు భర్త, అల్లరి చేసే కూతురితో జీవితం సాగించే మహిళగా తన పాత్ర ఉంటుందని చెప్పింది. ఈ పాత్ర వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, ఇలాంటి పాత్రలో నటించడం తనకు ఇదే తొలిసారి అని వెల్లడించింది. ‘ఇరుముడి’ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని, ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ప్రేక్షకులను కదిలిస్తుందని పేర్కొంది.
రవితేజతో కలిసి పనిచేయడంపై ప్రియా భవానీ శంకర్ ప్రశంసలు కురిపించింది. రవితేజ ఎనర్జీ అసాధారణమని, దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టమని చెప్పింది. అయితే ‘ఇరుముడి’లో ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త రవితేజను చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు శివ నిర్వాణ కథను చెప్పిన విధానం, పాత్రలను తీర్చిదిద్దిన తీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది. ప్రస్తుతం ‘దూత 2’ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నానని, ‘డెమోంటే కాలనీ 3’ కూడా విడుదలకు సిద్ధంగా ఉందని తన తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!