

రామాయణం.. తరాలు మారినా, కథన శైలులు మారినా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారతీయ మహాకావ్యం. ఈ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు, సీరియళ్లు, యానిమేషన్ చిత్రాలు రూపొందాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, అంజలీదేవి నటించిన లవకుశ తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పౌరాణిక చిత్రంగా గుర్తింపు పొందింది. రామాయణంలోని ఉత్తరకాండ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం 1987లో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ సీరియల్ దూరదర్శన్‌లో ప్రసారమై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత కూడా రామాయణ కథ వివిధ రూపాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. భారత్–జపాన్ సంయుక్త నిర్మాణంగా రూపొందిన రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ యానిమేషన్ రూపంలో ఈ మహాకావ్యాన్ని కొత్త తరానికి పరిచయం చేసింది. ఇక రామ్ సేతు వంటి చిత్రాలు రామాయణ సంప్రదాయం నుంచి స్ఫూర్తి పొందిన కథలను ఆధునిక కోణంలో ఆవిష్కరించాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కూడా రామాయణంలోని కీలక ఘట్టాలను భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి నితేష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ రామాయణపై ఉంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!