

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను స్థిరీకరించడంతో పాటు థియేటర్లను వసతుల ఆధారంగా వర్గీకరిస్తూ రాష్ట్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలను క్రమబద్ధీకరించాలన్న నిర్మాతల విజ్ఞప్తితో పాటు భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 14న జారీ కాగా.. బుధవారం వెలుగులోకి వచ్చాయి. మల్టీప్లెక్స్‌లకు సమానమైన డిజిటల్ సౌండ్ సిస్టమ్, 2కె/4కె ప్రొజెక్షన్, నాణ్యమైన సీట్లు వంటి సౌకర్యాలు కలిగిన సింగిల్స్క్రీన్ థియేటర్లను ‘స్పెషల్ థియేటర్’ కేటగిరీలోకి తీసుకురానున్నారు. ఇలాంటి థియేటర్లను జిల్లాల వారీగా గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
అత్యున్నత ప్రమాణాలతో రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలను ‘సూపర్ హైబడ్జెట్ సినిమాలు’గా గుర్తించనున్నారు. ఇలాంటి చిత్రాలకు తొలి విడుదల తర్వాత 10 రోజులపాటు నిర్దేశిత నిబంధనల ప్రకారం పెంచిన టికెట్ ధరలను వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే నిర్మాత ముందుగా ‘తెలుగు సినిమా పరిశ్రమ సంక్షేమ కమిటీ’ ఖాతాలో రూ.కోటి జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను సినిమా కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. మరోవైపు చిన్న సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య రోజుకు కనీసం ఒక షోను చిన్న బడ్జెట్ సినిమాకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. పండుగ రోజుల్లోనూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటి గంట మధ్య థియేటర్లలో రోజుకు గరిష్ఠంగా ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. టికెట్ ధరలకు జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని, అయితే ఏసీ థియేటర్లకు రూ.5, ఎయిర్‌కూల్డ్ థియేటర్లకు రూ.3 నిర్వహణ చార్జీలను పెంచిన ధరల్లోనే కలిపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని థియేటర్లలో 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని, ఎయిర్‌కూల్డ్ థియేటర్లను రెండేళ్లలో ఏసీ థియేటర్లుగా మార్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!