

నిషేధిత భూముల 22ఏ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా ఉండటం ఆశ్చర్యంగా ఉందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. తమ సొంత ఇంటికి సమస్య తలెత్తడంతోనే ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్‌కు సంబంధించిన ప్రభుత్వ భూములతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని హౌసింగ్ సొసైటీ భూములను కూడా 22ఏ జాబితాలో చేర్చారని అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న విషయం తెలియక రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, కమీషన్ల కోసం భూములను జాబితాలో చేర్చి, ముడుపులు తీసుకున్న తర్వాత తొలగిస్తున్నారనే ఆరోపణలపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పోరాటం కారణంగానే గోదావరి, కృష్ణా నదీ జలాల మేనేజ్‌మెంట్ బోర్డుల సమావేశాలు వాయిదా పడ్డాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను ఎజెండా నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న స్కామ్‌లను బయటపెడుతున్నందుకే సీఎం రేవంత్‌రెడ్డి తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయం, కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా ఆలయాలను ఆధ్యాత్మిక భావనతో సందర్శించానని, తాను ప్రత్యేక పూజలు చేసినట్లు సీఎం వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 370 కేసులు నమోదయ్యాయని, ప్రజలు తన పోరాటాన్ని గుర్తించి ఏడుసార్లు తనను గెలిపించారని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!